
Mahua Moitra: వివాదాస్పద టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ గా నోరు జారింది. అమిత్‌షా తల నరికి టేబుల్ మీద పెట్టాలన్నది. దేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే వందలాది మంది చొరబాటుదారులు లోపలకు అడుగుపెట్టి మన మహిళలను అగౌరవపరుస్తూ మన భూములు లాక్కుంటున్నారన్న ఆమె.. ఈ దుర్మార్గాలను అడ్డుకోని అమిత్ షా తల నరికి టేబుల్ పై పెట్టాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చొరబాటుదారుల వల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయని చెప్పారని, అప్పుడు ముందు వరుసలో ఉన్న హోం మంత్రి నవ్వుతూ, చప్పట్లు చరిచారని ఆమె అన్నారు. సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.
మహువా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
కేంద్ర మంత్రి అమిత్‌షా పై మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. విద్వేషంతో విషం చిమ్మేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ సూచనలతోనే ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, మహువా మొయిత్రా వ్యాఖ్యలపై సందీప్ మజుందార్ అనే స్థానికుడు కృష్ణానగర్ కొత్వాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.