
America Earthquake: అమెరికాను భూకంపం వణికించింది. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అంటార్కిటికా మధ్యలో ఉన్న డ్రేక్ పాసేజ్ లో ఉంది. మొదట్లో ఈ భూకంప తీవ్రత 8గా ఉన్నట్లు భావించినా, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) 7.5గా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్రకంపనల కారణంగా సునామీ ముప్పు పొంచి ఉండటంతో చిలీ దేశం అప్రమత్తమైంది. సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య ఈ డ్రీక్ పాసేజ్ ఉంటుంది.
భారతకాలమానం ప్రకారం ఈ భూకంపం ఉదయం 7.46 గంటలకు సంభవించింది. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి వార్తలు రాలేదు. డ్రేక్ పాసేజ్ దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవుల మధ్య లోతైన, విశాలమైన జలమార్గం. డ్రేక్ పాసేజ్ నైరుతి అట్లాంటిక్, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. USGS ప్రకారం, భూకంపం 10.8 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూమి లోపల ఏడు టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, ఒకదానికొకటి దూరంగా వెళ్ళినప్పుడు, భూమి కంపించడం ప్రారంభమవుతుంది.
రీసెంట్ గా రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8గా తీవ్రత నమోదైంది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.