తమిళనాడులోని తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ను విమర్శిస్తూ పుస్తకం ప్రచురించడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైలో ప్రారంభం కానున్న పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పెట్టరాదని ఆదేశించింది. అంతేకాకుండా న్యాయమూర్తిపై విమర్శలు గుప్పిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ పుస్తక ప్రచురణ సంస్థపై సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించింది.
న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు!
వేలూరుకు చెందిన నవీన్ ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్ స్వామినాథన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలతో ముద్రించిన పుస్తకాన్ని బుక్ ఎగ్జిబిషన్‌లో విక్రయిస్తే అది న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లవుతుందని, కాబట్టి ఆ పుస్తకం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం శ్రీవాత్సవ, జస్టిస్ జి.అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది.
కార్తీకదీపం వెలిగించుకునేందుకు హైకోర్టు అనుమతి
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలోతాజాగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వ వైఖరిని న్యాయమూర్తులు తప్పుబట్టారు. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లు జరుగుతాయనే కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది. కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులకు పరిమితంగానే అనుమతి ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. అది కూడా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.





