
Lok Sabha Uproar Parliament: తీవ్ర నేరారోపణలతో అరెస్టు అయిన వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులు లోక్ సభ ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించి మూడు బిల్లులను హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై లోక్ సభలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.ఈ బిల్లులు దుర్మార్గం, క్రూరమైనవంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు ఎంపీలు బిల్లు ప్రతులను చింపి అమిత్ షా వైపు విసిరారు. మరోవైపు బిల్లులకు మద్దతుగా ప్రతిపక్షాలను తప్పుపడుతూ అధికారపక్ష సభ్యులు నినాదాలకు దిగారు. దీనితో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కొందరు ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాను ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించారు. కొందరు కేంద్ర మంత్రులు, మార్షల్స్ వచ్చి అమిత్ షాకు రక్షణగా నిలిచారు.
జాయింట్ పార్లమెంట్ కమిటీకి మూడు బిల్లులు
విపక్షాల ఆందోళనలతో ఈ మూడు బిల్లులను మూజువాణి ఓటుతో జాయింట్ పార్లమెంట్ కమిటీకి(జేపీసీ) అప్పగిస్తున్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంటు తర్వాతి సమావేశాల్లో తొలివారం చివరి రోజున దీనిపై నివేదికను సమర్పించాలని సూచించారు. తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
బిల్లులు ఆమోదం పొందేనా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు జేపీసీ నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. జేపీసీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఐదేళ్లకుపైగా శిక్షపడే కేసుల్లో అరెస్టయి 30రోజులకుపైగా జైలులో ఉండే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను.. 31వ రోజున ఆటోమేటిగ్గా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా మూడు బిల్లులను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపొందించింది. మూడు బిల్లులు ఒకే అంశానికి చెందినవే అయినా.. రాజ్యాంగంలోని విభిన్నమైన ఆర్టికల్స్‌ను సవరించేందుకు వీలుగా వీటిని రూపొందించారు ఈ బిల్లులు రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.