
President Rule: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల పాటు ప్రెసిడెంట్ రూల్ పొడిగించింది. నిజానికి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఆగస్టు 13 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ, ఇంకా అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో సర్దుబాటుకాకపోవడంతో మరో ఆరు నెలలు పొడిగించడానికి సంబంధించిన తీర్మానానికి తాజాగా లోక్ సభ ఆమోదం తెలిపింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ తీర్మానాన్ని లోక్ సభ ముందుకు తీసుకొచ్చారు. చర్చ అనంతరం లోక్ సభ ఆమోదం తెలిపింది.
ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఫిబ్రవరి 13న అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న పార్లమెంట్ ఆమోదం తెలిపిందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ తెలిపిన ఆమోదం ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించాలంటే చట్టబద్ధమైన తీర్మానాన్ని పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాతి నుంచి ఒకే ఒక మరణం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు రాష్ట్రపతి పాలన ముఖ్యమన్నారు. ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపిన ఆయన.. పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.
మణిపూర్ లో అల్లర్లు ఎందుకు?
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొందుతున్న రిజర్వేషన్లను మైతీ సామాజికవర్గానికి కూడా అందించాలని 2024లో అక్కడి కోర్టు ఆదేశించినప్పటి నుంచి మైతీలు, కుకీల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
Read Also: హైవేపై సడన్ బ్రేక్ నిర్లక్ష్యమే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!