క్రైమ్జాతీయంవైరల్

Live-in Relationship: హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Live-in Relationship: రాజస్థాన్ రాష్ట్రంలో లివిన్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఒక కేసుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Live-in Relationship: రాజస్థాన్ రాష్ట్రంలో లివిన్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఒక కేసుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు యువకులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడాన్ని రాజ్యాంగం అడ్డుకోదని, వివాహ వయస్సు రాలేదనే కారణంతో వారి వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడం ఏ విధంగానూ చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు కలిసి జీవించాలనే నిర్ణయంతో ఉన్నారు. 2025 అక్టోబర్ 27 నుంచి సహజీవనం కొనసాగిస్తామని, ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రంపైనే ఇద్దరూ సంతకం చేసిన విషయాన్ని కూడా కోర్టులో వెల్లడించారు.

యువజంట ప్రేమతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, వారికి హానిచేస్తామని బెదిరింపులు చేస్తున్నారని యువజంట తమ పిటీషన్‌లో పేర్కొంది. ఈ బెదిరింపుల నుంచి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించినా.. తమ ఫిర్యాదును అధికారులు పట్టించుకోలేదని వారు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ మొదలైనప్పటికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరీ తన వాదనలో అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదని, ఇంకా వివాహానికి కావాల్సిన చట్టబద్ధ వయస్సు రాలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా లివిన్ రిలేషన్‌కు కోర్టు అనుమతి ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.

కానీ జస్టిస్ అనూప్ ధండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను ఖండించారు. వివాహ వయస్సు ఒక సామాజిక నిబంధన మాత్రమే అని.. వ్యక్తిగత జీవితాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కును ఎవ్వరూ హరించలేరని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ప్రతి వ్యక్తికీ జీవన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్ర్యం హక్కులు కలవని కోర్టు స్పష్టం చేసింది. లివిన్ రిలేషన్‌ను చట్టపరంగా నిషేధించలేమని, దాన్ని నేరంగా పరిగణించే అవకాశం లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

అంతేకాక, అమ్మాయి కుటుంబం నుంచి వచ్చిన బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని, ఆ యువజంటకు భద్రత కల్పించాల్సిన బాధ్యత బిల్వారా, జోద్‌పూర్ పోలీసులపైనే ఉందని జస్టిస్ ధండ్ ఆదేశించారు. పిటీషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, యువజంట రక్షణను ప్రాధాన్యంగా తీసుకోవాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు యువత వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే దిశగా, లివిన్ రిలేషన్‌షిప్‌పై ఉన్న అనవసర అపోహలను తొలగించే దిశగా ఒక ముఖ్యమైన నిర్ణయంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ALSO READ: 2025: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అంశాలివే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button