S Jaishankar on Pak Asim Munir: పాకిస్తాన్ ప్రభుత్వంపై, ఆదేశ ఆర్మీపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణమన్నారు. పాక్ ఆర్మీ భారత్‌పై సైద్ధాంతిక శత్రుత్వానికి పాల్పడుతోందని ఆరోపిచారు. “ఉగ్రవాదం, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి చూసినప్పుడు వారు ఇండియాపట్ల శత్రుత్వ విధానాన్ని అనుసరించడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చేస్తున్నదెవరు? పాక్ ఆర్మీనే” అని చెప్పుకొచ్చారు. అయితే పాక్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా దానిని ఎలా ఎదుర్కోవాలనేది న్యూఢిల్లీ చూసుకుంటుందన్నారు.
అక్కడి ఆర్మీ అధినేతలూ అంతే!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ గురించి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల్లో మంచి టెర్రరిస్టులు, చెడు టెర్రరిస్టులు ఉండనట్టే.. మంచి మిలటరీ నాయకులు, చెడ్డ మిలటరీ నాయకులు ఉండరని అన్నారు. భారత్ ఏ మిలటరీ ఆపరేషన్లు చేపట్టినా, నిర్దిష్ట నియమాలు, నిబంధల కిందే అమలు చేస్తుందన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, సివిల్ సొసైటీకి జవాబుదారీగా ఉంటుందన్నారు. తమ లక్ష్యం ఎప్పుడూ ఉగ్రవాదం అంతం మీదే ఉంటుంది తప్ప, సామాన్య ప్రజల మీద కాదన్నారు. కానీ, పాకిస్తాన్ ఆర్మీ పౌరులను అడ్డం పెట్టుకుని దొంగదెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. దొంగదారులను యుద్ధతంత్రంగా భావించడం ఆదేశానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శలు గుప్పించారు.
ఆపరేషన్ సిందూర్ గురించి..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. పాకిస్థాన్ లోని తొమ్మిది ప్రాంతాల్లో 24 క్షిపణి దాడులు జరిపింది. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మరో 60 మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఎల్ఓసీ వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.





