
Lifestyle: మార్నింగ్ నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి తలదాచుకునే వరకు చాలామంది జీవితాలు విపరీతమైన బిజీ షెడ్యూల్‌లోనే గడిచిపోతున్నాయి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురయ్యే ఒత్తిళ్లు కలిసి మనసును ఎప్పటికప్పుడు అలసిపోయేలా చేస్తున్నాయి. చిన్నచిన్న సమస్యలు కూడా కొందరికి పెద్దవిగా అనిపించి, వాటిని భూతద్దంలో పెట్టి చూసినట్లుగా ఆలోచించడంతో నిరుత్సాహం, నిరాశ పెరుగుతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి క్రమంగా శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. తలనొప్పులు, అలసట, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ కాస్త శారీరక చురుకుదనం ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. జిమ్‌లకు వెళ్లలేకపోయినా, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి సులభమైన వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం అరగంట పాటు శరీరాన్ని కదిలిస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో శరీరం చురుకుగా మారడమే కాకుండా, మనసు కూడా తేలికగా అనిపిస్తుంది. యోగా, ధ్యానం లాంటి సాధనలతో మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడమే అనేక సమస్యలకు మూలకారణంగా మారుతోంది. కోపం, ఆవేశం, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు మనసును భారంగా మారుస్తాయి. ఈ పరిస్థితుల్లో యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. రోజూ కొంత సమయం ఈ సాధనలకు కేటాయిస్తే మనసులోని ప్రతికూల భావాలు క్రమంగా తగ్గుతాయి. భావోద్వేగాలు నియంత్రణలోకి వచ్చి, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది.
ఒంటరితనం వేరు, ఒంటరిగా కొంతసేపు గడపడం వేరు అని నిపుణులు చెబుతున్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా ఒంటరిగా ఉండిపోవడం మానసిక సమస్యలకు దారి తీయవచ్చు. కానీ అప్పుడప్పుడు నిశ్శబ్దమైన ప్రదేశంలో, ప్రకృతికి దగ్గరగా కాసేపు ఒంటరిగా కూర్చోవడం ఎంతో మేలు చేస్తుంది. అలా ఉన్నప్పుడు మనసులోని ఆలోచనలను మనమే విశ్లేషించుకునే అవకాశం లభిస్తుంది. ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కూడా అలా ఏకాంతంలోనే దొరకొచ్చు. ఒత్తిడి, ఆందోళనలు క్రమంగా దూరమవుతాయి. అందుకే రోజులో కనీసం కొద్దిసేపైనా మనకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నాణ్యమైన నిద్ర కూడా ఉత్సాహంగా ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చాలా ఆరోగ్య సమస్యలకు నిద్రలేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు పనితీరు తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపించడం, చిరాకు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారిలో మానసిక, శారీరక అనారోగ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. నిద్రపోయే ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉండటం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరుచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆలోచన విధానం కూడా మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. ప్రతీ విషయాన్ని ప్రతికూలంగా చూడటం అలవాటైతే నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి. అదే సానుకూలంగా ఆలోచించే అలవాటు ఉంటే సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. పాజిటివ్ థింకింగ్ మనలో ఆశావాదాన్ని పెంచి, జీవితంపై మంచి దృక్పథాన్ని కలిగిస్తుంది. అందుకే వీలైనంత వరకు ప్రతి పరిస్థితిలోనూ మంచి కోణాన్ని చూడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
కృతజ్ఞతాభావం కూడా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మనం హ్యాపీగా ఉండటానికి అనేక అంశాలు కారణమవుతాయి. కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, ప్రకృతి, లభించిన అవకాశాలు అన్నింటిపట్ల కృతజ్ఞతగా ఉండటం మనలో అంతర్గత ఆనందాన్ని పెంచుతుంది. మనకు మేలు చేసిన వారిని గుర్తు చేసుకోవడం, చిన్న విషయాలకైనా కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలై ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇలా రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే బిజీ లైఫ్ మధ్యలోనూ ఉల్లాసంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు
ALSO READ: Hindu Spiritual Beliefs: అయ్యప్పకు కన్నె స్వాములంటేనే ఎందుకు ఇష్టమో తెలుసా?





