
Life Stages: జీవిత ప్రయాణంలో కాలం అందరికీ సమానంగా కదులుతుందేమో కానీ పరిస్థితులు, అనుభవాలు, అవకాశాలు, ప్రతి వ్యక్తి ఎదుర్కొనే సవాళ్లు మాత్రం పూర్తిగా వేరేలా ఉంటాయి. అందుకే నిపుణులు చెబుతున్న ముఖ్యమైన సూచన ఏమిటంటే.. ఒకరు మరొకరిని పోల్చుకోవద్దు, తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను, వారి ఆరోగ్యం, వయసు, ఆర్థిక స్థితి, మానసిక వేగం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలి. జీవితంలో కొన్ని ప్రత్యేకమైన దశలు ఉంటాయి. ఇవి వయసును బట్టి మారుతుంటాయి. ఆ దశల్లో తీసుకున్న సరైన నిర్ణయాలు భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి. తప్పు నిర్ణయాలు మాత్రం సంవత్సరాల తరబడి భారంగా మారవచ్చు. అందుకే యువత నుంచి పెద్దల వరకు అందరూ ఏ వయస్సులో ఏం చేయాలి అనే దాని గురించి తెలిసి ఉండటం చాలా ముఖ్యం.
ఇప్పుడు ఆ దశలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..
20 ఏళ్ల దశ- జీవితానికి పునాది వేసే కాలం..
ఇరవై ఏండ్ల వయసు ఒక మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన దశ. ఈ వయసులో మనకు ఉన్న ఉత్సాహం, ధైర్యం, ఎనర్జీ జీవితంలో మరే దశలో ఉండదు. ఈ వయస్సు సరదాలకు మాత్రమే కాదు, భవిష్యత్తు నిర్మాణానికి సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవడం మొదటి పని. స్కిల్స్‌ను పదునుపెట్టడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మంచి అవకాశాలను గుర్తించడం ఇవన్నీ ఇరవైల్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు.
అదే సమయంలో చిన్న మొత్తాలైనా పొదుపు మొదలుపెట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఇరవైల్లో వేసిన చిన్న ఆర్థిక పునాది, తర్వాత జీవితంలో పెద్ద రక్షణగా మారుతుంది. ఆరోగ్యం విషయంలోనూ అలవాట్లు ఈ వయస్సులోనే ఏర్పడతాయి. ధూమపానం, మద్యపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిద్రపట్ల శ్రద్ధ పెట్టడం ఇవన్నీ మీ మిగతా జీవితానికే పునాది వేస్తాయి.
30 ఏళ్ల దశ- స్థిరత్వాన్ని సాధించాల్సిన సమయం
మనం ఇరవైల్లో నేర్చుకున్న విషయాలను అమల్లో పెట్టే వయసు 30లు. ఈ దశలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే నిపుణులు ఈ వయస్సులో అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. సరదాలు, ఎంజాయ్‌మెంట్ అన్నీ ఉండాలి కానీ అవి మీ సరిహద్దులు దాటి మీ జీవితం మీద ప్రభావం చూపకూడదు.
ఈ కాలంలో కెరీర్‌లో స్థిరపడటం అత్యంత ముఖ్యం. ఉద్యోగంలో పదోన్నతులు, ఆదాయ వృద్ధి, పెట్టుబడులు, ఇల్లు కొనుగోలు, వ్యాపార ప్రణాళికలు.. వీటిని ప్లాన్ చేయడానికి ఇదే సరైన వయస్సు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 30ల వయస్సులో ఒత్తిడి, బాధ్యతలు, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. అందుకే స్వీయ సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలి.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం: సంబంధాల్లో జాగ్రత్త. మీకు నిజంగా సపోర్ట్ చేసే వ్యక్తులను గుర్తించి వారిని దూరం చేసుకోవద్దు. టాక్సిక్ వ్యక్తులతో దూరంగా ఉండటం ఈ వయస్సులో మీ మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.
40 ఏళ్ల దశ- ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఆస్వాదించాల్సిన వయస్సు
నలభై ఏళ్లలో మనిషి సాధారణంగా కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటాడు. గత 20 ఏళ్లుగా చేసిన పొదుపులు, కష్టపడి సంపాదించిన అనుభవం ఈ వయస్సులో భరోసానిస్తుంది. అందుకే 40ల్లో జీవితం ఎలా ఉండాలి అనేది ఎంతో మంది ఆలోచించే ప్రశ్న.
ప్రధానంగా ఈ దశలో ఆర్థిక స్థిరత్వం ఉండడం వల్ల మానసిక ప్రశాంతతకు అవకాశం లభిస్తుంది. కుటుంబం, పిల్లలు, సంబంధాలు, స్వీయ సంతృప్తి.. ఇవన్నీ ముఖ్యంగా మారుతాయి. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్య కావచ్చు. అందుకే రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి.
ఈ దశలో తీసుకునే నిర్ణయాలు శేష జీవితానికి బలమైన పునాది అవుతాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితం సాగేందుకు, మిగతా రోజులను సంతోషంగా గడపడానికి ఈ వయస్సు అత్యంత నిర్ణయాత్మకమైనది.
ALSO READ: Couple Relationship: మహిళల్లో తగ్గుతున్న లైంగిక ఆసక్తులు.. కారణమిదే





