Leela Palace Udaipur: హోటల్ గదిలో దంపతులు ఉండగా, హౌస్‌కీపింగ్ సిబ్బంది ఒకరు మాస్టర్ కీతో వారి గదిలోకి ప్రవేశించడాన్ని వినియోగదారుల కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వారి ప్రైవసీకి భంగం కలిగించినందుకు గాను రూ. 10 లక్షలు జరిమానా విధించింది. ఈ ఘటన ఉదయ్ పూర్ లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. వారు చెల్లించిన అద్దె రూ.55 వేలను 9 శాతం వడ్డీతో వాపస్ చేయాలని, లిటిగేషన్ ఖర్చుల నిమిత్తం మరో రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇచ్చిన రెండు నెలల్లోపు ఈ మొత్తం బాధితులకు చెల్లించాలని గతనెల 16న ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏమైందంటే?
చెన్నైకి చెందిన మహిళా న్యాయవాది 2025 జనవరి 26న తన భర్తతో కలిసి ఈ హోటల్‌లోని లేక్ వ్యూ ఉన్న గ్రాండ్ రూమ్‌లో దిగారు. తామిద్దరం బాత్రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ఒకరు మాస్టర్ కీతో లోపలికి వచ్చేశారని ఆమె ఆరోపించారు. అప్పటికీ నో సర్వీస్‌అని తాము అరుస్తూనే ఉన్నామని, అయినా బాత్రూమ్ డోర్‌లోంచి లోనికి తొంగి చూశారని ఆమె తెలిపారు. ఇది తమ ప్రైవసీకి తీవ్రంగా భంగం కలిగించడంతోపాటు, మానసికంగా కుంగుబాటుకు గురిచేసిందన్నారు. ఇది సర్వీస్ లోపం కిందకి కూడా వస్తుందని చెన్నై లోని జిల్లా వినియోగదారుల కోర్టు అభిప్రాయపడింది. వారికి కలిగిన అసౌకర్యానికి జరిమానా చెల్లించాల్సిందేనని వెల్లడించారు.





