
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. ఈకేవైసీ చేయించుకోని వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా, ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాలు కూడా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది గ్యాస్ వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే గ్యాస్ సిలిండర్ రాయితీతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.500 గ్యాస్ సబ్సిడీ కూడా ఈకేవైసీ లేని వినియోగదారులకు నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ నిబంధన ప్రధానంగా ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే ఉండగా, తాజాగా సాధారణ గ్యాస్ వినియోగదారులకు కూడా ఇది తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పటినుంచో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. చాలామంది ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం గడువును మరికొంత కాలం పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం జనవరి 31 వరకు మాత్రమే ఈకేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ తేదీ దాటితే గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీలో సమస్యలు తలెత్తడంతో పాటు సబ్సిడీ కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేయడం చాలా సులభమని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చే వ్యక్తి వద్ద బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది. అందులో ఆధార్ బయోమెట్రిక్ వివరాలు ఇచ్చిన వెంటనే ఈకేవైసీ పూర్తవుతుంది. అంతేకాదు, తాము గ్యాస్ తీసుకునే సంబంధిత ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇక ఆధునిక సాంకేతికతను వినియోగించుకునే వారు గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే www.pmuy.gov.in/e-kyc.html
వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, లేదా ఆయిల్ ఇండస్ట్రీ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఈ విషయమై తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన గడువు ముగిసిపోయిందని, తాజా నిర్ణయం ప్రకారం జనవరి 31 చివరి తేదీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండకపోవచ్చని హెచ్చరించారు.
అదే సమయంలో గ్యాస్ భద్రతపై కూడా ఆయన కీలక సూచనలు చేశారు. నాణ్యతలేని స్థానిక రబ్బర్ ట్యూబుల వాడకమే అనేక గ్యాస్ ప్రమాదాలకు కారణమవుతోందని తెలిపారు. వినియోగదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ ఉన్న రబ్బర్ ట్యూబులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ALSO READ: ప్రియుడితో లేచిపోయిన భార్యకు పోలీసుల ముందే ఊహించని శిక్ష వేసిన భర్త (VIDEO)





