
HCU విద్యార్దులు చేస్తున్న పోరాటానికి పార్టీ తరపున సెల్యూట్ చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. విద్యార్థులతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించాలని అన్నారు. విద్యార్థులను గుంట నక్కలు అని ముఖ్యమంత్రి అంటడు.. ఒక మంత్రి పేమెంట్ బ్యాచ్ అంటడు.. మరో మంత్రి అక్కడ జంతువులు, పక్షులు లేవని అంతా ఏ ఐ టెక్నాలజీ అంటడు.. ప్రజాపాలనకు పాతర వేసి బుల్డోజర్ పాలన చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ భూమికి మీరు కాపలాదారు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూమి అయితే దొంగల్లా బుల్డోజర్ లతో ఎందుకు కూల్చివేతలు చేపట్టారని కేటీఆర్ ప్రశ్నించారు.వీకెండ్స్ కూల్చివేతలపై హైడ్రాపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. మీరు కోర్టు ఆదేశాలు ఉన్నా ఎలా కూల్చివేతలు చేస్తారని నిలదీశారు.కెసిఆర్ HCU భూములపై ముఖ్య నేతలతో చర్చించారని తెలిపారు. హరిత విప్లవం సృష్టించిన ప్రభుత్వం కెసిఆర్ దని.. 7.7% ఫారెస్ట్ ఏరియా పెరిగింది కెసిఆర్ హయాంలోనని వెల్లడించారు. కేంద్రం 2021లో ఇదే విషయం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిందని కేటీఆర్ తేల్చి చెప్పారు.
ప్రతి ఊరులో నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. మూడేళ్లలో మేము అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని.. ఇది హైద్రాబాద్ ప్రజలకు బిఆర్ఎస్ ఇస్తున్న హామీ అన్నారు. ఆ 400ఎకరాల్లో ఇంచు కూడా ఎవరూ కొనవద్దని సూచించారు. HCU భూముల్లో వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. రోహిత్ వేముల విషయంలో రాహుల్ గాంధీ వస్తే ఎస్కార్ట్ ఇచ్చామన్నారు. ఇప్పుడు HCUలో ఇంత జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకురారు… ఎందుకు మాట్లాడరని కేటీఆర్ నిలదీశారు.