క్రైమ్జాతీయం

కొడుకు చనిపోయాక, కోడలిపై మరో వ్యక్తితో కలిసి అత్త దారుణం

మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ఉద్యోగం కోసం కన్నతల్లి హృదయం రాతిగా మారింది.

మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ఉద్యోగం కోసం కన్నతల్లి హృదయం రాతిగా మారింది. కోడలిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్త.. ఆస్తి కోసం ప్రాణాలు తీసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం రేపింది. లతాబాయి అనే మహిళ తన కోడలు రూపాలిని మరో వ్యక్తితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 1న కల్యాణ్ ప్రాంతంలోని వాల్ధుని వంతెన సమీపంలో తల, ముఖంపై తీవ్ర గాయాలతో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమికంగా ఈ ఘటనను ప్రమాదంగా భావించిన పోలీసులు మహాత్మా ఫులే చౌక్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు లతాబాయి తన కోడలు రూపాలి ఉదయం నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తీరుతో పాటు ప్రవర్తన పోలీసులకు అనుమానాన్ని కలిగించింది.

ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వాల్ధుని వంతెన వద్ద లభించిన మృతదేహాన్ని లతాబాయికి చూపించారు. అప్పుడు ఆమె ఆ మృతదేహం తన కోడలు రూపాలిదేనని గుర్తించింది. అయితే ఇక్కడే పోలీసులకు మరింత అనుమానం బలపడింది. ఒకవైపు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం, మరోవైపు మృతదేహాన్ని వెంటనే గుర్తించడం పోలీసులను లోతైన విచారణకు దారితీసింది.

ఇన్‌స్పెక్టర్ విజయ్ నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ బృందం లతాబాయిని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. లతాబాయి కుమారుడు విలాస్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో మృతి చెందాడు. అతడి మరణానంతరం లభించే గ్రాట్యుటీ డబ్బు రూ.10 లక్షలు తనకే ఇవ్వాలని, అలాగే తన మనవడికి కారుణ్య నియామకంగా రైల్వే ఉద్యోగం ఇప్పించాలని లతాబాయి కోడలు రూపాలిపై ఒత్తిడి తెచ్చింది.

ఈ విషయంలో రూపాలి ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆస్తి తన చేతికి రాకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భావించిన లతాబాయి.. మరో వ్యక్తి సహాయంతో రూపాలిని తొలగించేందుకు పథకం వేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇనుప రాడ్‌తో రూపాలి తలపై తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు విచారణలో తేలింది.

హత్య అనంతరం ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని వాల్ధుని వంతెన వద్ద పడేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఏమి తెలియనట్టుగా కోడలు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల చాకచక్యంతో ఈ హత్య కేసు 24 గంటల్లోనే ఛేదించబడింది.

ఈ కేసులో లతాబాయి సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని రిమాండ్‌కు తరలించింది. ఆస్తి కోసం రక్త సంబంధాలనే తుడిచిపెట్టిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డబ్బు కోసం మనిషి ఎంతటి పాశవికత్వానికైనా దిగజారగలడని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ALSO READ: మూడు పూటలా అన్నం తిన్నా జపాన్ వాళ్లు బరువెందుకుండరో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button