
Kruti Shetty: సినిమా నటీనటులు అప్పుడప్పుడు పంచుకునే వ్యక్తిగత అనుభవాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. కానీ అలాంటి అనుభవాలు నిజమా? లేక సినిమాల ప్రమోషన్ కోసమా? అన్న సందేహాలు కూడా కలుగుతుంటాయి. ముఖ్యంగా ఆత్మలు, అద్భుతాలు, దైవిక అనుభూతుల గురించి చెప్పినప్పుడైతే ప్రజలు మరింత ఆసక్తిగా స్పందిస్తారు. ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా ప్రాచుర్యం పొందిన కృతి శెట్టి కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన అనుభూతి గురించి ఓ సందర్భంలో బయటపెట్టింది.
కార్తీ నటించిన తమిళ చిత్రం ‘వా వాతియర్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) షూటింగ్ మొదలుకానున్న ముందురోజు రాత్రి తాను హోటల్ గదిలో ఎదుర్కొన్న అనుభవం ఎంతో వింతగా అనిపించిందని ఆమె చెప్పింది. తల్లితో కలిసి రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, గదిలో అకస్మాత్తుగా ఓ అస్పష్టమైన ఆత్మలాంటి ఆకృతి కనిపించిందని, ఆశ్చర్యంతో లైట్స్ ఆన్ చేయగానే పెద్ద శబ్దం వచ్చిందని, వెంటనే ఆ రూపం అదృశ్యమైందని కృతి తెలిపింది. ఇది తన ప్రాక్టీస్ చేస్తున్న పాత్రకే సంబంధించిన ఆలోచనల ప్రభావమా? లేక నిజంగానే ఏదో దైవిక శక్తి తనను కాపాడడానికి వచ్చిందా? అనేది తానూ అర్థం చేసుకోలేకపోయానని చెప్పింది.
తాను తుళు సముదాయానికి చెందినదని, తమ పూర్వీకులను దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం తమకు ఎంతో పవిత్రమని తెలిపింది. చిన్ననాటి నుంచే ఆత్మల, దేవతల ఉనికిపై నమ్మకం ఉన్నందువల్ల ఈ సంఘటన తన విశ్వాసాన్ని మరింత బలపర్చిందని చెప్పింది. ఈ అనుభవం కేవలం భ్రమ మాత్రమే కాదు.. ఏదో శక్తి తనను ఆ క్షణంలో కాపాడిన భావన కలిగించిందని కూడా చెప్పింది.
ఇక ఆమె నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, కృతి ఆత్మలతో మాట్లాడగల జిప్సీ తరహా పాత్రలో కనిపించబోతోంది. ఆమె ఇటీవల చెప్పిన అనుభవం చూస్తే, ఇది సినిమా ప్రమోషన్‌లో భాగమా? లేక నిజంగానే తాను అనుభవించిన సంఘటననా? అనే ప్రశ్న అభిమానుల్లో చర్చనీయాంశమవుతోంది.
కృతి శెట్టి కెరీర్ విషయానికొస్తే.. ‘ఉప్పెన’తో వచ్చిన విజయం తర్వాత తెలుగులో చేసిన సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. వరుస ఫ్లాపులతో ఆమె కెరీర్ డల్ అయ్యింది. దీంతో తమిళ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించి అక్కడ అవకాశాలు వెతికింది. అయితే కోలీవుడ్‌లో చేసిన కొన్ని సినిమాలు కూడా షూటింగ్ ఆలస్యం, విడుదల సమస్యలు, సాంకేతిక కారణాలతో వెనక్కిపడ్డాయి. కార్తీతో చేసిన ఈ చిత్రం కూడా రెండేళ్లకు పైగా సెట్స్‌లో ఉండి ఇప్పుడు మాత్రమే విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆమె చెప్పిన ఈ అద్భుత అనుభవం ఎంతవరకు నిజం? ఎంతవరకు పబ్లిసిటీ? అనేది అందరికీ సందేహమే అయినా, ఆమె చెప్పిన విధానం మాత్రం కొంతమందిని ఆశ్చర్యపరచింది, మరికొంతమందిని ఆసక్తిపరిచింది. ఏదేమైనా ఈ సంఘటన ఆమె నటించిన పాత్రకూ, సినిమా ప్రయాణానికీ ఒక మిస్టరీ గ్లామర్ జోడించినట్టే.
ALSO READ: Interesting fact: గాడిద పాలు vs ఒంటె పాలు.. ఏది ఖరీదైనదంటే..?





