
Kotak Bank Account: అప్పుడుప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లోకి పొరపాటుగా కొన్ని డబ్బులు డిపాజిట్ అవుతుంటాయి. సదరు డబ్బు తాలూకు వాళ్లు ఫోన్ చేసి, జరిగిన పొరపాటు గురించి చెప్పి తమ డబ్బు వాపస్ తీసుకుంటారు. కానీ, తాజాగా చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నోయిడాలోని దన్ కౌర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దీవీ 2 నెలల క్రితం చనిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోన్‌ను కొడుకు దీపక్ వాడుతున్నాడు. ఆదివారం రాత్రి అతడికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయ్యాడు. తల్లి అకౌంట్లోకి రూ. లక్ష కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ అయిందని ఆ మెసేజ్‌లో ఉంది. వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో నిజంగానే అంత డబ్బు పడిందని ఉంది. తల్లి ఖాతాలో అంత డబ్బు పడిందా? లేదా? అని తెలుసుకోవడానికి మరుసటి రోజు దీపక్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు. బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని చెప్పారు.
డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీస్తున్న అధికారులు
ఈ డబ్బు డిపాజిట్ గురించి బ్యాంకు అధికారులు ఆదాయపన్ను అధికారులకు సమాచారం అందించారు. ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయన్నదానిపై విచారణ మొదలెట్టారు. బ్యాంకు వైపు నుంచి టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందా? లేదంటే మనీ ల్యాండరింగ్ ఏమైనా జరిగిందా? అని అనుమానిస్తున్నారు. త్వరలోనే అసలు విషయం తెలుస్తుందని అధికారులు వెల్లడించారు.
Read Also: రష్యాను మళ్లీ వణికించిన భూకంపం.. తీవ్రత 6.0గా నమోదు!