తెలంగాణ

కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రి కోమటిరెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని డిసైడ్ అయిన గుత్తా.. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారని తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఎప్పటినుంచో వైరం ఉంది. కోమటిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. . వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు.. గుత్తా టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వార్ సాగింది. తర్వాత గుత్తా బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య పోరాటం నడిచింది. ప్రస్తుతం ఇద్దరి అధికార పార్టీలోనే ఉన్నారు. అయినా వీరిద్దరి మధ్య విభేదాలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే వస్తున్నాయి.

గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా తనకున్న అధికారంతో గత నెల రెండో వారంలో 3 కోట్ల రూపాయల అంచనాతో ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించారు. నల్లగొండ నియోజకవర్గంలో ఒక కోటి 50 లక్షలు, నకిరేకల్‌ నియోజకవర్గంలో 70 లక్షలకు నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో 80 లక్షలకు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆమోదం కోసం పంపించారు. మంత్రి తుమ్మల వెంటనే ఆమోదం తెలపడంతో.. జిల్లా త్రిపాఠి వాటి గ్రౌండింగ్‌ కోసం ప్రొసీడింగ్స్‌ జారీచేశారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కలెక్టర్ జారీచేసిన ప్రోసిడింగ్స్ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాకు తెలియకుండా ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తారని వెంటనే వాటిని రద్దు చేయాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక జిల్లా కలెక్టర్ ఆ మూడు కోట్ల ప్రతిపాదనలకు సంబంధించి జారీ చేసిన ప్రోసిడింగ్స్ రద్దు చేస్తూ మర్నాడే ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ విషయాన్ని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా జిల్లాలో ఏ నియోజిక వర్గంలోనైనా పనులను ప్రతిపాదించే హక్కు తనకు ఉందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదన. కానీ తనకు తెలియకుండా ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.తన ప్రతిపాదనల రద్దు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మండలి చైర్మన్‌.. అసెంబ్లీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠీకి నోటీసులు జారీ చేయించారట. తను పంపించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనల రద్దు విషయమై స్వయంగా చైర్మన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలనేది ఆ నోటీసులో ఉన్న సారాంశం. ఈ నోటీసు జారీ విషయమై కలెక్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చారట. దీనిపై అలర్ట్‌ అయినా మంత్రి కోమటిరెడ్డి ఇంచార్జ్‌ మంత్రి తుమ్మలతో గుత్తాకు బుజ్జగించే ప్రయత్నం చేశారట. కానీ ఈవిషయంలో మండలి చైర్మన్‌ మాత్రం తగ్గేదేలేదని ముఖంమీదే తెగేసి చెప్పారట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button