కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతానికి భిన్నంగా జనంలోకి వెళుతున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండరనే టాక్ ఉంది. కాని ఇప్పుడు మాత్రం రూట్ మార్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిత్యం జనంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలతో నేరుగా సమావేశం అవుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో బస్సు ఎక్కిన రాజగోపాల్ రెడ్డికి ఓ మహిళా ప్రయాణికురాలు షాకిచ్చింది.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు. అప్పుడే చౌటుప్పల్ నుండి నల్గొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సులోని మహిళలను పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు.
Read More : 7 రోజుల్లో 17,869 వేల కోట్లు ఇచ్చాం… రేవంత్ సంచలనం
బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని కండక్టర్ ని డ్రైవర్ ని అడిగారు. అయితే ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని..కాని టికెట్ తీసుకున్న వాళ్లకు బస్సులో సీటు దొరకడం లేదని ఒక మహిళ నేరుగా కోమటిరెడ్డితో చెప్పేసింది. దీంతో కోమటిరెడ్డితో పాటు బస్సులో ఉన్న అందరూ నవ్వేశారు. నవ్వుకుంటూనే మహిళకు సమాధానం చెబుతూ కిందకు దిగారు రాజగోపాల్ రెడ్డి.