Kolkata Fire Tragedy: కోల్‌కతా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 21కి చేరుకుంది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించామని పోలీసులు తెలిపారు.
ఇంతకీ అసలు ఏమైందంటే?
జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేళ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం ఉదయం 3 గంటలకు ఆనంద్‌పూర్ ప్రాంతంలోని రెండు ఫుడ్ గోదాంలలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. గోదాం లోపల పొడి ఆహర పదార్థాలతో పాటూ మండే వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గంటల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. చాలా సమయం తర్వాత అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపులు చేపట్టగా తొలి రోజు 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాజాగా మరో 5 మృతదేహాలు లభ్యం!
తాజాగా మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. మిగతా వారి కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉన్నందున.. డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల గుర్తింపు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు మోమో కంపెనీ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా వారి కుటుంబాలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం, వారి పిల్లల చదువు బాధ్యతలు భరిస్తామని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.





