
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రతిపక్షాల ఇండియా కూటమిలో చేరింది. ఈ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు బి. మాణికం టాగోర్ అధికారికంగా వెల్లడించారు.
చెన్నైలోని టీఎన్‌సీసీ కార్యాలయంలో శనివారం జరిగిన బహుళ పార్టీల సమావేశంలో టీవీకేను కూటమిలోకి చేర్చే నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సమావేశానికి టీవీకే తరఫున మంత్రులు ఆధవ్ అర్జున, ఎన్. మేరీ విల్సన్ హాజరయ్యారు. కాంగ్రెస్‌తో పాటు సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌కు చెందిన ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
టీవీకే ఇండియా కూటమిలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన పరిణామమని మాణికం టాగోర్ పేర్కొన్నారు. ఈ రోజును చారిత్రక దినంగా అభివర్ణించిన ఆయన.. టీవీకే చేరికతో రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తుల కూటమి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
ఇదే సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ అంశంపైనా విపక్ష పార్టీలు చర్చించాయి. ఎన్నికల కమిషన్ చీఫ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 13, 14 తేదీల్లో జిల్లాల స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని, అక్టోబర్ 15న చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు.
మరోవైపు ఇండియా కూటమిలో టీవీకే అధికారికంగా చేరిన విషయాన్ని ఆ పార్టీ మంత్రి ఆధవ్ అర్జున కూడా ధ్రువీకరించారు. అయితే కూటమిలో చేరికపై టీవీకే అధినేత, సీఎం విజయ్ నుంచి ఇప్పటివరకు నేరుగా అధికారిక ప్రకటన వెలువడలేదు.
విజయ్ నేతృత్వంలోని టీవీకేకు తమిళనాడు రాజకీయాల్లో పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈ కూటమి నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
also read: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం