జాతీయం

Local Body Polls: కేరళలో బీజేపీ జోరు, తిరువనంతపురం కార్పొరేషన్‌ లో తొలిసారి విజయం!

కేరళలో బీజేపీ సత్తా చాటింటి. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుంది.

Kerala Local Body Polls: కమ్యూనిస్టుల కంచుకోట కేరళలో బీజేపీ సత్తా చాటింది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ అద్భుత విజయాన్ని అందుకుంది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 101 వార్డులకుగాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్‌పై కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్‌ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేసింది.

1 స్థానం నుంచి ఏకంగా 50 స్థానాలకు..

అధికార కూటమి లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్)కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని కట్టబెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్‌ పెంచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఊహించని విధంగా 50 వా ర్డుల్లో విజయం దక్కించుకోవడం పట్ల కూటమి నేత లు హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్‌లో పాగా వేసే వరకు చేరుకుంది. తాజా ఎన్నికల్లో.. ఎన్డీయే 50 స్థానాల్లో గెలవగా ఎల్‌డీఎఫ్‌ 29, యూడీఎఫ్‌ 19 వార్డులకే పరిమితమయ్యాయి. మరో రెండు చోట్ల స్వతంత్రులు విజయం దక్కించుకున్నారు. మరోవైపు, ఎర్నాకుళం కార్పొరేషన్‌ను కూడా ఎన్డీయే కైవసం చేసుకుంది.

శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాజకీయాల్లో ఇది గణనీయమైన మార్పునకు సంకేతమన్నారు. కాంగ్రెస్‌, యూడీఎఫ్ తరఫున విజయం దక్కించుకున్న కార్పొరేటర్లకు శుభాకాంక్షలు చెబుతూనే బీజేపీ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రజల ఆకాంక్షలకు ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, వక్ఫ్‌ భూముల వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎర్నాకుళం జిల్లాలోని  మునంబం వార్డును కూడా బీజేపీ దక్కించుకుంది. 2019 నుంచి ఈ ప్రాంతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి 404 ఎకరాల భూమిని కేరళ వక్ఫ్‌ బోర్డు తమ ఆస్తిగా ప్రకటించుకుంది. దీంతో ఇక్కడ నివసిస్తున్న 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Read Also: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button