
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికను కేబినెట్ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ముందు ఈ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఏంటి…? అరెస్టులేనా…? అరెస్ట్ చేస్తే ఎవరిని చేస్తారు..? కర్త, కర్మ, క్రియా అంతా కేసీఆర్ అని నివేదికలో పేర్కొన్నారు. మరి కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తారా..? లేక.. ముందు అధికారులు, ఆ తర్వాత నేతలు.. చివరిగా కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తారా…? కాళేశ్వరం ఇష్యూలో ఏం జరగబోతోంది..? ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది. ఈ రిపోర్ట్‌పై కేసీఆర్ రియాక్షన్ ఏంటి..?
Read also : నయా సైబర్ మోసం – 87లక్షలు జమచేసి మూడు కోట్లు లూటీ
కాళేశ్వరం కమిషన్ నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించారు. 16 మందిని దోషులుగా తేల్చారు పీసీ ఘోష్ కమిషన్. ఆ 16 మందిలో మొదటి పేరు కేసీఆర్‌దే. ఆ తర్వాత హరీష్‌రావు, ఈటల రాజేందర్, అధికారులు ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్, సి.మురళీధర్, హరిరామ్, బి.నాగేందర్‌రావుతో పాటు పలువురు ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు. కళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమంతా లోపాలే అని… నిపుణుల సలహాలు పట్టించుకోకుండా… కేసీఆర్ చెప్పినట్టు చేసుకుంటూ పోయారని కాళేశ్వరం నివేదికలో పేర్కొన్నారు. CWC నివేదిక, నిపుణుల సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అన్ని నిర్ణయాలు ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌వే అని తేల్చింది కాళేశ్వరం కమిషన్. ఆనాడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న హరీష్‌రావు కూడా నియమ, నిబంధనలు పాటించలేదన్నారు. అలాగే.. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా… ప్రాజెక్ట్ విషయంలో నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు కూడా రూల్స్ అతిక్రమించారని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్‌ను మార్చడం కూడా సరైన నిర్ణయం కాదని.. అందులో నిజాయితీ లేదని కమిషన్ తేల్చింది.
Read also : ఆ లిల్లీపుట్ నన్నేంత వాడా – జగదీష్‌రెడ్డికి కవిత కౌంటర్ – కేసీఆర్ రియాక్షన్ ఇదే..!
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించిన తెలంగాణ మంత్రివర్గం… ఆ నివేదికను ఆమోదించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత… భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. కమిషన్ సూచనలను అమలు చేస్తామన్నారు. అయితే.. తమకు ఎవరిపై వ్యక్తిగతంగా కక్ష సాధింపులు లేవని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
కాళేశ్వరం నివేదికపై తన ఫామ్‌హౌస్‌లో ఆరు గంటలపాటు కీలక సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశంలో హరీష్‌రావు, కేటీఆర్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదని.. కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని అన్నారు. అంతేకాదు.. ముందు ఊహించినట్టే నివేదిక ఇచ్చారన్నారు. ఈ ఇష్యూలో కొంతమంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చని… అయినా, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని అన్నారు కేసీఆర్. ఈ దుష్ప్రచారాన్ని తప్పికొట్టాలన్నారు.
ఇక… మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఎన్నికల కోసం ఎవరో కావాలనే… పిల్లర్ల కింద బాంబు పెట్టి పేల్చుండవచ్చని అంటున్నారు. మేడిగడ్డ డ్యామేజ్‌కు ముందు ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు కూడా చెప్పారని గుర్తుచేస్తున్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఆ దిశగా దర్యాప్తు చేయిస్తామని అంటున్నారు. కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకే.. ఇలాంటి కుట్ర చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఏది ఏమైనా… కాళేశ్వరం కమిషన్ నివేదిక.. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. వాట్ నెక్ట్స్ ..? అనే చర్చకు కూడా తెరతీసింది.
Read also :కన్నీరు తెప్పిస్తున్న హనుమకొండ ఇంటర్ అమ్మాయి సూసైడ్ లెటర్!