
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న నాయకత్వ సంక్షోభంపై పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో అన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యనే కొనసాగించాలా, లేక డీకే శివకుమార్‌కు కీలకమైన సీఎం పదవిని అప్పగించాలా అన్న అంశంపై హైకమాండ్ తీవ్రమైన పరిశీలన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అంతర్గత చర్చలు, సంప్రదింపులు, వ్యూహాత్మక సమావేశాలు వరుసగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకల్లా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై స్పష్టత తీసుకురావాలనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు సమాచారం.
డీకే శివకుమార్ వారం రోజులుగా రాహుల్ గాంధీని కలిసి తన అభిప్రాయాలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రాహుల్ స్వయంగా డీకేకు వాట్సాప్ ద్వారా ఒక చిన్న కీలకమైన సందేశం పంపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ “వేచి ఉండండి.. నేను మీకు ఫోన్ చేస్తాను” అని పంపిన సందేశం రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనితో డీకే పక్షం మరింత ఉత్సాహంగా ఉండగా, సిద్ధరామయ్య వర్గం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు డీకే నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతుండగా, సోనియా గాంధీతో భేటీకి కూడా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, కర్ణాటక కాంగ్రెస్‌కు సంబంధించిన తాజా పరిస్థితిపై రాహుల్ గాంధీ ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చేగౌడ వంటి నేతలతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత రాహుల్ గాంధీ ప్రియాంక్ ఖర్గేతో మరో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడటం ఈ పరిణామాలపై మరింత ఆసక్తిని పెంచింది. రెండు శిబిరాలు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకోకుండా సహనం పాటించాలనే సూచనలు రాహుల్ ఇచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు ఇది అత్యంత కీలకమైన సమయం. నాయకత్వ మార్పు జరిగితే పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా చూసుకోవడం అత్యంత అవసరం అని రాహుల్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాలు సున్నితమైన స్థితిలో ఉండటంతో, ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ సమాన ప్రాధాన్యత లభించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది.
ఒక వేళ డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించే పరిస్థితి వస్తే, మిగతా వర్గాల అసంతృప్తిని నివారించేందుకు పీసీసీ చీఫ్ పదవి, డిప్యూటీ సీఎం పదవులు, ఇతర కీలక విభాగాలను సంబంధిత సామాజిక వర్గాల నాయకులకు ఇచ్చే అవకాశం ఉందని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఈ సమీకరణాలన్నీ సజావుగా అమలు చేస్తేనే కర్ణాటకలో కాంగ్రెస్ స్థిరంగా కొనసాగుతుందని హైకమాండ్ భావిస్తోంది.
ALSO READ: Girija Oak: ‘మీతో గంట గడపడానికి ఎంత ఖర్చవుతుంది? అని ఒకరు నాకు మెసేజ్ చేశారు’





