చోరీ చేసిన కాసేపటికే మృత్యువుతో పోరాటం!
మర్రిగూడలో రెచ్చిపోయిన కేటుగాళ్లు – ఒకే రాత్రి రెండు బైక్‌ల చోరీ.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):మర్రిగూడ మండలంలో దొంగలు బరితెగించారు. మర్రిగూడ మండలంలో వరుస చోరీలతో కలకలం రేపారు. అయితే ఒక బైక్ దొంగను మాత్రం, అతను చేసిన పాపం వెనువెంటనే వెంటాడింది. బైక్‌ను దొంగిలించి పారిపోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదం, సదరు నిందితుడిని మృత్యువు వాకిట నిలబెట్టింది. ఆదివారం అర్ధరాత్రి మండలంలోని రాజపేటతండా, తమ్మడపల్లి గ్రామాల్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నిద్రిస్తున్న జనాన్ని ఆసరాగా చేసుకుని, రెండు మోటార్ సైకిళ్లను అపహరించారు. తమ్మడపల్లిలో ఒక ఖరీదైన పల్సర్ బైక్‌ను ఎత్తుకెళ్లిన దొంగ, పోలీసులకు దొరక్కుండా ఉండాలనే ఆత్రుతతో, చౌటుప్పల్ వైపు అతివేగంగా దూసుకెళ్లాడు.
క్లైమాక్స్ అదిరింది!
వేగం మృత్యుపాశమై సదరు దొంగను కాటేసింది. చౌటుప్పల్ సమీపంలో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో, నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఐసీయూ బెడ్‌పై కొట్టుమిట్టాడుతున్నాడు. చేసిన తప్పుకు శిక్ష వెంటనే అనుభవించడం అంటే ఇదేనేమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో, మండల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కూడా, మాయమవుతుండటంతో ప్రజలు భయందోలన చెందుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నామని, ఇతను అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడా! లేక స్థానికుడా అనే కోణంలో విచారణ సాగుతోందన్నారు. గ్రామాల్లో రాత్రి గస్తీని పెంచుతామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు..
