
Resignation in Protest: భారతీయ న్యాయ వ్యవస్థలో సామాన్యులకు న్యాయం జరగడం అంత ఈజీ కాదనే విమర్శలు ఉన్నాయి. సామాన్యుల సంగతి అటుంచితే న్యాయస్థానాల్లో పని చేసే న్యాయమూర్తులకు కూడా న్యాయం దక్కడం లేదు. తాజాగా మహిళా న్యాయమూర్తిని లైంగికంగా వేధించిన జడ్జికి ప్రమోషన్ రావడంతో అందరూ షాకయ్యారు. ఈ ప్రమోషన్ ను నిరసిస్తూ సదరు మహిళా జడ్జి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ లోని శహడోల్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న అదితి కుమార్ శర్మ అనే మహిళా న్యాయమూర్తి తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తనను లైంగికంగా, మానసికంగా వేధించిన న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తాకు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ప్రమోషన్ లభించడానికి నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. గుప్తా పదోన్నతిని నిరసిస్తూ తాను రాష్ట్రపతికి, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టుకు, రిజిస్ట్రార్ జనరల్, కొలీజియంకు కూడా లేఖలు రాశారు. తాను రాసిన లేఖలపై ఎలాంటి స్పందన లేదని సదరు మహిళా న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనుభవించిన హింస కేవలం శారీరకమైనది కాదని, తన గౌరవం, గళం, న్యాయమూర్తిగా అస్తిత్వం నాశనం అయ్యాయని ఆమె కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ రాజీనామా వ్యవహారం మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారింది.
Read Also: గంటల్లో ‘బస్టాండ్ బాలుడి’ కథ సుఖాంతం.. నల్లగొండ టూ టౌన్ సిబ్బందిపై ఎస్పీ పవార్ ప్రశంసలు!