జాతీయం

రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 వరకు జీతం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలని కలలు కనే ఇంజినీరింగ్ యువతకు శుభవార్త లాంటిదే 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సు నోటిఫికేషన్.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలని కలలు కనే ఇంజినీరింగ్ యువతకు శుభవార్త లాంటిదే 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సు నోటిఫికేషన్. తాజాగా ఈ కోర్సులో ప్రవేశాల కోసం భారత సైన్యం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అర్హత కలిగిన పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్ నుంచి ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. జనవరి 7 2026 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 5 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ 67 కోర్సు సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఎంఐఎస్సీ వంటి పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు వ్యవధి ఒక సంవత్సరం. శిక్షణ పూర్తి చేసిన వెంటనే అభ్యర్థులను సైన్యంలో విధుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. 2026 అక్టోబర్ 1 లోపు డిగ్రీ పూర్తిచేయనున్న ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ నోటిఫికేషన్‌లో మహిళలకు అవకాశం లేదు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.

ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే భారత సైన్యం నిర్దేశించిన కఠిన ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. 10.30 నిమిషాల్లో 2.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాలి. అలాగే కనీసంగా 40 పుష్ అప్స్ 6 పుల్ అప్స్ 30 సిట్ అప్స్ చేయగలగాలి. స్విమ్మింగ్‌లో కూడా కనీస నైపుణ్యం ఉండటం తప్పనిసరి. ఈ ఫిజికల్ టెస్టుల్లో విఫలమైన వారికి ఎలాంటి సడలింపు ఉండదు.

అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్ 1 నుంచి 2006 సెప్టెంబర్ 30 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. వచ్చిన దరఖాస్తులను మొదట షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మార్కులు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు ఫిజికల్ స్టాండర్డ్స్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసి విధుల్లోకి చేరిన తర్వాత నెలకు గరిష్టంగా రూ.1,77,500 వరకు జీతం అందుతుంది. దేశ సేవ చేయాలనే తపనతో పాటు స్థిరమైన కెరీర్ కోరుకునే ఇంజినీరింగ్ యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: కన్న కూతురిని వ్యభిచారంలోకి దింపిన తండ్రి, రుతుస్రావంలోనూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button