
Operation Sindoor: భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం విషయమంలో అమెరికా జోక్యం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ప్రధాని మోడీకి, ట్రంప్ కాల్ చేసినట్లు మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనన్నారు. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందంపై.. జైశంకర్ లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత సైన్యం దాడుల్ని తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. “ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకూ ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాల్ చేసి మోడీతో మాట్లాడారు. పాకిస్థాన్ భారీ దాడికి పాల్పడనుందని ఆయన చెప్పగా.. ఒకవేళ అదే జరిగితే మేము అంతకంటే భారీ దాడులతో బదులిస్తామని మోడీ అన్నారు. మే 9, 10వ తేదీన పాక్ సైన్యం క్షిపణిదాడులను భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది’ అని జైశంకర్ వివరించారు.
కాల్పుల విరమణకు పాక్ నుంచే విజ్ఞప్తి!
అటు కాల్పుల విరమణకు పాక్ సిద్ధంగా ఉందని పలు దేశాలు తమకు సమాచారం అందించాయని జైశంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. చివరకు పాక్ కాల్పుల విరమణ చేసుకుందామని చెప్పిందన్నారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయగా.. హోంమంత్రి అమిత్ షా కలగజేసుకున్నారు. ప్రతిపక్షాలు మనదేశ విదేశాంగ శాఖ మంత్రినే శంకిస్తున్నాయన్నారు. వాళ్లకు ఇతర దేశాలపై మాత్రం నమ్మకం ఉందని గట్టి కౌంటర్ ఇచ్చారు షా. దీంతో ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి.
Read Also: లక్ష్యం ఛేదించాకే యుద్ధం ఆపాం.. రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు!