గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందిస్తారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లా స్థాయిలో కలెక్టర్ స్థాయిలో వివిధ విభాగాల్లో పురస్కారాలు ప్రకటించి.. రిపబ్లిక్ డే వేడుకల్లో అందిస్తారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనతో
ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన సుమారు 250 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. ఐతే ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి స్వయంగా అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించడం ఆనవాయితీ. కానీ తూతూ మంత్రంగా కొంత మందికి ప్రశంసాపత్రాలు ఇచ్చి మిగతావి ఖాళీ కుర్చీల మీద పడేశారు.
అతిధులు వెళ్ళిపోయాక ఉద్యోగులు తమ ప్రశంసాపత్రాలను వెతుక్కొని తీసుకున్నారు. తమ సేవలకు జిల్లా నాయకులు, అధికారులు ఇచ్చిన గౌరవ, మర్యాదలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉత్తమ ఉద్యోగుల పట్ల ఇంత చెత్తగా వ్యవహరిస్తారా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.