
Donald Trump On Elon Musk: అపరకుబేరుడు ఎలన్ మస్క్ ఏర్పాటు చేసిన అమెరిక పార్టీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ పెట్టడం ఓ జోక్ అన్నారు. అమెరికాలో ఎప్పుడూ రెండు పార్టీల వ్యవస్థే ఉందన్నారు. మూడో పార్టీని స్థాపించడం అంటే అమెరికాలో గందరగోళానికి కారణం కావడమే అన్నారు. ఆ పార్టీ దేశంలో కలహాలకు కారణమయ్యే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో పార్టీని అమెరికన్లు అంగీకరించరని చరిత్ర చెప్తుందన్నారు. మస్క్ నియంత్రణ కోల్పోయారన్న ట్రంప్, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు.
మూడో పార్టీ సక్సెస్ కాలేదు!
ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుందని ట్రంప్ చెప్పారు. డెమోక్రట్లు రోజు రోజుకు తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు విమర్శించారు. అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకే అనుకూలంగా ఉందన్నారు. మూడో పార్టీ అనేది సక్సెస్ అయిన సందర్భం లేదన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు.
మస్క్ మారిపోయాడు!
గత ఎన్నికల్లో మస్క్ తనకు మద్దతు ఇచ్చినా, ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ విమర్శించారు. గత కొద్ది వారాలుగా ఆయన అదుపు కోల్పోయారన్నారు. తమ మధ్య ఉన్న బంధాన్ని ముగించే స్థితికి ఆయన చేరుకున్నారని ట్రంప్ వెల్లడించారు. తాజాగా బిగ్ బ్యూటీఫుల్ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. చాలా గొప్ప బిల్లు మస్క్ కు నచ్చడం లేదన్నారు. ఎందుకంటే, అందులో ఈవీలను తప్పనిసరి చేసే క్లాజ్ ను తొలగించినట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు గ్యాస్, హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. గతంలో మస్క్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంతేకాదు, తన సన్నిహితులను నాసా చీఫ్ గా నియమించాలని అనుకున్నారని, కానీ, ఆ నియామకాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. అమెరికాకు మేలు చేసే పనులు చేయడమే లక్ష్యమని చెప్పారు.
Read Also: అమెరికాలో పుట్టిన మరో పార్టీ, పేరు ప్రకటించిన ఎలన్ మస్క్!