ISRO’s PSLV-C62 Mission Launch: బాహుబలి రాకెట్ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో.. కొత్త సంవత్సరం విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ -ఎన్1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఉదయం 10.18 గంటలకు ప్రయోగం
తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన 22.30 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 11.48 గంటలకు మొదలైంది. కౌంట్‌డౌన్ పూర్తవగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈవోఎస్ -ఎన్1తో పాటు 15 ఉపగ్రహాలు నింగిలోకి
ఈ రాకెట్ ద్వారా 1,485 కిలోల బరువున్న ఈవోఎస్ -ఎన్1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో రోదసిలోకి పంపనుంది. రాకెట్ పైకి ఎగిరి 4దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్ శిఖర భాగాన ఉన్న ఈవోఎస్ -ఎన్1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యనువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
అనంతరం 15 బుల్లి ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు 10 సెకన్ల వ్యవధిలోనే కక్ష్యలోకి చేర్చనున్నారు. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కాగా, డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈవోఎస్ -ఎన్1 ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు అన్వేషణ్ గా నామకరణం చేశారు.





