
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 4 ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన దివి వాద్య తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇప్పటివరకు సినిమాల్లో కొన్ని పరిమిత పాత్రలకే ఆమె కెరీర్ పరిమితమైంది. అయినప్పటికీ సరైన బ్రేక్ వస్తే తన కెరీర్ ఒక్కసారిగా మారుతుందనే నమ్మకంతో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ దివి బిజీగా కొనసాగుతోంది. తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో దివి ప్రత్యేక అతిథిగా పాల్గొనగా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యక్తిగత అంశాలపై దివి చెప్పిన మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
షో ఆరంభంలోనే యాంకర్ వర్ష ఇచ్చిన ఇంట్రడక్షన్‌తో సరదా వాతావరణం నెలకొంది. వర్ష వేసిన పంచులకు అదే స్థాయిలో దివి రివర్స్ పంచులు వేస్తూ నవ్వులు పూయించింది. ఈ క్రమంలో తన గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించిన దివి.. తాను మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించానని చెప్పడంతో వర్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇక ఈ అమ్మాయిపై క్రష్ ఉన్నవాళ్లు జాగ్రత్త అంటూ వర్ష వేసిన సెటైర్ ప్రేక్షకులను బాగా నవ్వించింది. దీంతో షో మొదటి నుంచే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగింది.
ఇక దివి హైట్ విషయంపై కూడా సరదా చర్చ జరిగింది. అమ్మాయిలు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటే అబ్బాయిలు తట్టుకుంటారా అంటూ వర్ష వేసిన ప్రశ్నకు, దివి నవ్వుతూ అందుకే నాకు ఇంకా అబ్బాయి దొరకలేదు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. దీంతో వర్ష దివి సింగిల్ అని పంచ్ వేయడం మరో హైలైట్‌గా నిలిచింది. ఈ సంభాషణలు షోలో నవ్వుల వర్షం కురిపించాయి.
పెళ్లి అంశం వచ్చినప్పుడు దివి మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి. భవిష్యత్తులో పెళ్లి అయితే అన్నిటికీ అడ్జస్ట్ అవుతావా అని వర్ష అడగగా, నన్ను ప్రేమగా చూసుకుంటే అన్నిట్లో తగ్గి ఉంటా అంటూ దివి ఎమోషనల్‌గా స్పందించింది. అలాగే బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు చెడు మాటలు చెప్పుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందని, విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి వెర్షన్ వాళ్లకు కరెక్ట్‌గా అనిపిస్తుందని ఆమె చెప్పిన మాటలు చాలామందిని ఆలోచనలో పడేశాయి.
ప్రేమలో ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు కూడా దివి చాలా క్లియర్‌గా తన అభిప్రాయాన్ని చెప్పింది. మనతోనే ఉండాలి అని అనుకోవడం ప్రేమలో భాగమే కానీ, ఆ ప్రేమలో స్వేచ్ఛ ఉండాలని ఆమె స్పష్టం చేసింది. ఎదుటి వ్యక్తికీ ఒక ప్రపంచం, ఒక జీవితం ఉంటుందని, దాన్ని గౌరవించాల్సిందేనని దివి చెప్పిన మాటలు చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. ప్రేమ పేరుతో పరిమితులు విధించడం సరైంది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక ప్రేమపై వేసిన చివరి ప్రశ్నలకు దివి మరింత భావోద్వేగంగా స్పందించింది. తన జీవితంలో ప్రేమ సెట్ కాలేదని, లవ్ చాలా పెయిన్‌ఫుల్ అనుభూతి అని చెప్పింది. బ్రేకప్ తర్వాత మనసులో ఖాళీ, లోపలే చనిపోయినట్లైన ఫీలింగ్ వస్తుందని ఆమె చెప్పిన మాటలు హార్ట్ టచ్ చేశాయి. ప్రేమ అంటే గిఫ్టులు లేదా సెక్స్ మాత్రమే కాదని, కేరింగ్ అసలు ముఖ్యమని దివి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ALSO READ: మహిళల్లో గర్భధారణకు అద్భుతంగా పని చేసే, మార్కెట్‌లో దొరికే నేచురల్ వయాగ్రా ఏంటి?





