
హైదరాబాద్, (ప్రత్యేక ప్రతినిధి): సమయం కాస్త మారినా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయ వేడి తగ్గడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం అన్ని రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సీటును దక్కించుకోవడానికి వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. అంతర్గత సమావేశాలు, అగ్ర నేతల సమీక్షలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సీటుపై పట్టు సాధించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
గమనార్హంగా, జూబ్లీహిల్స్ కోసం కేవలం పార్టీలు మాత్రమే కాకుండా, స్థానికంగా ఉద్యమకారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయించడానికి సిద్దమవుతున్నామని కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో అభ్యర్థి ఎంపిక చర్చలు, బీజేపీలో అసలు ఎవరు బరిలో దిగుతారనే తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కూడా తగిన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఈ సీటును నిలుపుకోవాలన్న దిశగా దూకుడు పెంచింది. అదే సమయంలో ఎంత మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతారో చెప్పలేని స్థితి కనిపిస్తోంది.
Also Read : టీడీపీ మద్దతు అడిగిన కేటీఆర్…ఏ కోణం లో… అసలు ఈ వార్తల్లో నిజమెంత?
సామాజిక సమీకరణలు, కార్పొరేట్, వాణిజ్య, ఫిలిం సర్కిల్ ప్రభావం గల నియోజకవర్గం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఈ సీటును గెలుచుకోవడం కోసం ప్రధాన పార్టీలకు సర్వశక్తులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.