రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్,క్రైమ్ మిర్రర్:- రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రోడ్ సేఫ్టీ మాసంలో గుర్తించిన ప్రమాద స్థలాలను మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, జాతీయ రహదారి శాఖా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపడుతున్న భద్రతాపరమైన చర్యలపై మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం జాయింట్‌ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
రోడ్ల పురోగతి పనులు జరుగుతున్న ప్రాంతాలకు కనీసం 500 మీటర్ల దూరం నుంచే సూచిక బోర్డులు, తగిన డైవర్షన్లు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రణకు సంబంధించిన బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో తగిన లైటింగ్‌ వ్యవస్థ, బ్లింకర్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలని తెలిపారు. సైన్‌బోర్డులు, డైవర్షన్ల ద్వారా వేగ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు.

Read also : ఊపిరి పీల్చుకున్న కోహ్లీ ఫ్యాన్స్.. “అన్న వచ్చేసాడోయ్ “

మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన ప్రదేశాల్లో తప్పనిసరిగా ఐమాక్స్‌ లైట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. పాఠశాల విద్యార్థులను రవాణా చేసే బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండేలా తనిఖీలు నిర్వహించాలని, ప్రతి పాఠశాల డ్రైవర్‌ ఫిట్‌నెస్‌ను ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీవోను ఆదేశించారు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే పూర్తి బాధ్యత రవాణా శాఖదేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని డీఈవోను ఆదేశించారు.
ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్న ఘటనలపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలను అరికట్టాలని, డ్రైవర్లకు పూర్తి అవగాహన కల్పించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రహదారుల వెంట ఉన్న 63 గ్రామాల్లో యువకులకు సీపీఆర్‌ (CPR)పై శిక్షణ ఇచ్చి, ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర ప్రథమ చికిత్స అందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పకడ్భందీ చర్యలు చేపట్టాలని రాబోయే రోజుల్లో ప్రమాదాలు తగ్గేలా చూడాలన్నారు. దీనికిగాను ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిరోజూ ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు,పట్టణాలు-గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల అనేక అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నామని పేర్కొంటూ, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రత విషయంలో పోలీస్‌ శాఖ రాజీ పడబోదని, ప్రమాదాల నివారణకు నిరంతరం కఠిన చర్యలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణాధికారి చిన్న బాలు, డీఈఓ రమేష్ కుమార్, పోలీస్‌, ఎన్‌హెచ్‌, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read also : మళ్లీ పెరగనున్న పెట్రోల్, డిజిల్ ధరలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button