
Interesting Fact: భారతదేశం అనగానే విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, నమ్మకాల సమాహారం మన కళ్లముందు నిలుస్తాయి. కులాలు, మతాలు, ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఆధునిక యుగంలోకి ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ, మన దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ శతాబ్దాల నాటి సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉన్న ఆచారాలు వినడానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి అరుదైన, వింత సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లా పిని గ్రామంలో ఇప్పటికీ కొనసాగుతోంది.
పిని గ్రామంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒక ప్రత్యేక పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల విషయంలో పాటించే నియమాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ పండుగ జరిగే ఐదు రోజుల పాటు గ్రామంలోని మహిళలు దుస్తులు ధరించకూడదనేది అక్కడి ప్రధాన నియమం. అంతేకాదు, ఆ సమయంలో మహిళలు నవ్వడం కూడా నిషేధించబడింది. పండుగ కాలంలో మహిళలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాలి. గ్రామంలోని పురుషుల ఎదుటకు రావద్దనే ఆచారం ఉంది. బయటకు వెళ్లాల్సి వస్తే తమ శరీరాన్ని ఉన్ని దుప్పట్లతో కప్పుకుని మాత్రమే కదలాలి.
ఈ సంప్రదాయానికి సంబంధించిన నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి. గ్రామస్తులు ఆరాధించే దేవత ఒక రాక్షసుడిని ఓడించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, భద్రబ్ మాసం తొలి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. ఆ సమయంలో దుష్టశక్తులు మహిళల గౌరవంపై దాడి చేస్తాయని, వారి దుస్తులను చింపివేస్తాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ముందుగానే మహిళలు దుస్తులు ధరించకుండా ఉండడం ద్వారా ఆ శక్తులను శాంతింపజేస్తామనే విశ్వాసంతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు చెబుతారు. కొన్ని కుటుంబాలు ఇది పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమని, దేవతల ఆజ్ఞగా భావిస్తూ కొనసాగిస్తున్నారు.
కాలక్రమేణా ఈ సంప్రదాయంలో కొంత మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతరం మహిళలు ఈ ఆచారాన్ని పూర్తిగా నగ్నంగా కాకుండా, చాలా సన్నని దుస్తులు ధరించే విధంగా మార్చుకున్నారు. అయితే గ్రామంలోని వృద్ధ మహిళలు మాత్రం ఇప్పటికీ పాత సంప్రదాయాన్ని యథాతథంగా పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి లేదా వారి కుటుంబానికి చెడు జరుగుతుందని గ్రామంలో బలమైన నమ్మకం ఉంది. ఆ సంప్రదాయాన్ని పాటించని మహిళకు కొన్ని రోజుల్లో చెడు వార్తలు వింటారని, అలాగే భార్యాభర్తలు ఈ నియమాలను విస్మరిస్తే వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారని కూడా విశ్వసిస్తారు.
మహిళలకే కాకుండా పురుషుల కోసం కూడా ఈ పండుగ సమయంలో కఠినమైన నియమాలు ఉన్నాయి. ఐదు రోజుల పాటు పురుషులు మద్యం సేవించకూడదు, మాంసాహారం తీసుకోకూడదు. పూర్తిగా నియమ నిష్ఠతో జీవించాలి. ఈ నియమాలను అతిక్రమిస్తే దేవతలు కోపించి గ్రామానికి అపశకునం కలుగుతుందని నమ్ముతారు. ఈ కారణాలతోనే ఆధునిక చట్టాలు, లింగ సమానత్వ ఆలోచనలు ఉన్నప్పటికీ, పిని గ్రామంలో ఈ పురాతన సంప్రదాయం ఇప్పటికీ అనాదిగా కొనసాగుతోంది. ఈ ఆచారం సంప్రదాయమా, మూఢనమ్మకమా అనే చర్చ ఒకవైపు సాగుతుంటే, మరోవైపు గ్రామస్తులు మాత్రం తమ విశ్వాసాలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరు.





