
Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం కోరుకునేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ అవకాశాన్ని అందించింది. పదో తరగతి మాత్రమే చదివిన అభ్యర్థులకు కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఇది పెద్ద అవకాశం కావడంతో ఈ ప్రకటన ఇప్పటికే ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. అప్లికేషన్ ప్రక్రియ 22 నవంబర్ 2025 నుంచి అధికారికంగా ప్రారంభంకానుండగా, దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 14, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమ వివరాలను హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ క్యాడర్‌లో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ, కనీస విద్యార్హతగా పదో తరగతి పాస్ అయి ఉండటం సరిపోతుందని స్పష్టం చేశారు. అదనంగా, శారీరకంగా దృఢంగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సిన ప్రాథమిక ప్రమాణాలను పూర్తి చేయడం తప్ప మరే ప్రత్యేక అర్హత కూడా అవసరం లేదు. 14 డిసెంబర్ 2025 నాటికి దరఖాస్తుదారు వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిర్దిష్ట వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తించవచ్చు.
దరఖాస్తు సమర్పించాలనుకునే వారు చివరి తేదీకి ముందు, అంటే 14 డిసెంబర్ 2025 రాత్రి 11.59 గంటల లోపు తమ సమాచారాన్ని పూర్తి చేసి సమర్పించాలని అధికారులు సూచించారు. వెబ్‌సైట్ www.mha.gov.in లేదా నేషనల్ కేరియర్ సర్వీస్ పోర్టల్ www.ncs.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసే అవకాశం లేదు. అర్హత ప్రమాణాలు, విధివిధానాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష నమూనా, జీతభత్యాలు వంటి వివరాలను కూడా ఇదే వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశంగా భావించబడుతోంది.





