
INS Udaygiri-INS Himgiri: భారతీయ నౌకాదళంలోకి మరో రెండు కొత్త యుద్ధ నౌకలు అడుగు పెట్టాయి. ప్రాజెక్టు 17 ఆల్ఫాలో భాగంగా దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలను విశాఖ వేదికగా జెండా ఊపి జల ప్రవేశం చేయించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ యుద్ధ నౌకలు అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.
భారత నేవీ దేశ ఆర్థిక భద్రతకు ముఖ్య స్తంభం
భారత నావికాదళం కేవలం సముద్రాన్ని పరిరక్షించడానికే పరిమితం కాదని, దేశ ఆర్థిక భద్రతకు కీలక స్తంభం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత ఇంధన అవసరాలైన చమురు, సహజ వాయువులు తీరప్రాంత భద్రతపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలతో స్వయం సమృద్ధి భారతం కలలు సాకారమయ్యాయన్నారు. ఇవి భారత విజన్, అంకితభావానికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
ప్రాజెక్టు 17 ఆల్ఫాలో భాగంగా యుద్ధనౌకల నిర్మాణం
ప్రాజెక్ట్ 17 ఆల్ఫాలో భాగంగా పూర్తి దేశీయంగా ఈ యుద్ధ నౌకలను నిర్మించారు. 2 యుద్ధ నౌకలను ఏకకాలంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించగా, ఐఎన్ఎస్ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది. ఈ రెండు యుద్ధ నౌకలతో భారత నావికాదళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతలో ఈ రెండు యుద్ధ నౌకలు చరిత్ర సృష్టిస్తాయనే నమ్మకం తనకుందన్నారు.