
హైదరాబాద్ నగర శివారులోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సంతానం కలగడం లేదనే తీవ్ర మానసిక వేదనతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన ఐత సుప్రియ (25)ను గతేడాది పెద్దపల్లికి చెందిన వినయ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం అనంతరం వినయ్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు రావడంతో దంపతులు అమీన్‌పూర్‌లోని సృజన లక్ష్మీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వినయ్ నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
వివాహం అయిన కొద్ది నెలల నుంచే దంపతులు సంతానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వైద్యులను సంప్రదించడం, చికిత్సలు చేయించుకోవడం జరిగినా ఫలితం లేకపోవడంతో సుప్రియ మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పిల్లలు లేకపోవడమే తన జీవితంలో లోటుగా భావిస్తూ తరచూ మనోవేదనకు గురవుతుండేదని సమాచారం.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున భర్త నిద్రిస్తున్న సమయంలో సుప్రియ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, పొరుగువారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు.
ALSO READ: Sexual Health: అంగస్తంభనను, యోని స్పందనను అధిక రక్తపోటు ఎలా ప్రభావితం చేస్తుంది?





