
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26 నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. సంక్రాంతి పండుగకే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, కొన్ని పరిపాలనా కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో జనవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది.
ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు పూర్తిగా జమ కావడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి రైతు భరోసా పంపిణీలో పారదర్శకత కోసం శాటిలైట్ సర్వే ఆధారంగా యాసంగి సీజన్‌లో వాస్తవంగా పంట సాగు చేస్తున్న భూములను గుర్తిస్తున్నారు. దీంతో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా వర్తించదని స్పష్టమవుతోంది.
రైతు భరోసాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకం అయిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను కూడా విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా భూమి లేని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రిపబ్లిక్ డే రోజున జనవరి 26న ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.6 వేలు జమ కానున్నట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి ఏడాది రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కూలీలు, కౌలు రైతులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా మారింది. గత ఏడాది ప్రారంభమైన ఈ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అంచనా.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు తమ సమీప ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చి నిధులు మంజూరు చేస్తారు. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: ఇదేం శాపంరా బాబు!.. ‘ఈ గ్రామంలో 60 ఏళ్లుగా మరుగుజ్జులు మాత్రమే పుడుతున్నారు’





