
క్రైమ్ మిర్రర్ : కార్యకలాపాలు నిలిచిపోయిన పెట్రోల్ బంక్‌ను సీల్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. బంక్‌ను సీల్ చేసే విషయంలో యజమాని కుటుంబంతో జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బంక్ ఆపరేటర్ కుమారుడు కత్తితో అధికారిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చోంధి ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ బంక్ సాంకేతిక సమస్యల కారణంగా సుమారు మూడు నెలలుగా మూసి ఉంది. ఈ నేపథ్యంలో బంక్‌ను సీల్ చేసేందుకు ఇండియన్ ఆయిల్లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేష్ షెల్కే అక్టోబర్ 6న తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.
బంక్ సీల్‌పై వాగ్వాదం
బంక్‌ను సీల్ చేసే ప్రక్రియ విషయంలో ఆపరేటర్ సాహెబ్రావ్ పాండవీర్ కుటుంబ సభ్యులకు, మహేష్ షెల్కేకు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంక్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు మరో నెల రోజుల గడువు ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ అధికారులు అంగీకరించకపోవడంతో వివాదం ముదిరినట్లు సమాచారం. వాగ్వాదం తీవ్రరూపం దాల్చిన సమయంలో సాహెబ్రావ్ పాండవీర్ కుమారుడు ఉమేష్ పాండవీర్ కత్తితో మహేష్ షెల్కేపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కడుపు, వీపు, ముఖంపై పలుమార్లు కత్తిపోట్లు పడటంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడే కుప్పకూలారు. ఏడుసార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాల కారణంగా మహేష్ షెల్కే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు రెండు కార్లలో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
నిందితుల కోసం పోలీసుల గాలింపు
ఘటనపై కురుండ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. పరారైన నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఘర్షణ సమయంలో అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇండియన్ ఆయిల్, కేంద్ర మంత్రి ఖండన
తమ సంస్థ అధికారిపై జరిగిన దాడిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అర్విందర్ సింగ్ సాహ్నీ తీవ్రంగా ఖండించారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా మహేష్ షెల్కే హత్యను ఖండించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. మహేష్ షెల్కే కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, పెట్రోలియం మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
also read : భార్యను మరో వ్యక్తితో చూసిన భర్త.. ఇద్దరిపై ఆరు రౌండ్లు కాల్పులు!