India’s Space Stars Shine Bright: భారతీయ వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి ఇండియన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాకు కేంద్రం అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను ప్రకటించింది. ఇస్రో గగన్‌యాన్ మిషన్‌లో భాగమైన మరో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మొత్తంగా 70 మందికి సైనిక పురస్కారాలు ప్రకటించింది. మేజర్ అర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లను కీర్తిచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. మరో 13 మందికి శౌర్యచక్ర, ఒక బార్ టు సేన, 44 మందికి సేన, ఆరుగురికి నవ్ సేన, ఇద్దరికి వాయుసేన పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఆరుగురికి మరణానంతరం ప్రకటించారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో శుభాంశు, ప్రశాంత్ కీలక పాత్ర
అంతరిక్షంలోకి మనుషులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, మరో ఇద్దరికి వ్యోమగాములుగా శిక్షణ ఇస్తోంది. అంతరిక్షంలో పరిస్థితులు, ఇబ్బందులు, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం, అనుభవం కోసం వారిలో ఒకరిని ముందే విదేశాల ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. సుఖోయ్, మిగ్, జాగ్వార్ సహా కీలక యుద్ధ విమానాలు నడిపిన అనుభవమున్న శుభాంశు శుక్లాను ఎంపిక చేసి.. యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షకేంద్రానికి పంపింది. శుభాంశు శుక్లా అంతరిక్షంలో భార రహిత స్థితిలో పలు కీలక ప్రయోగాలు నిర్వహించారు. ఇస్రో గగన్‌యాన్ ప్రయోగాల కోసం ఆయన అనుభవం, సేకరించిన సమాచారం కీలకంగా మారనుంది. ఈ క్రమంలో ఆయనను అశోక చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపే బృందంలో కీలక సభ్యుడైన ప్రశాంత్ బాలకృష్ణన్‌కు కీర్తి చక్ర ప్రకటించింది. గగన్‌యాన్ కోసం మరో ఇద్దరు వాయుసేన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ శిక్షణ పొందుతున్నారు.





