India vs New Zealand 4th T20I Highlights: ఆల్ రౌండర్ శివం దూబే 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌ల తో సునాయాసంగా 65 పరుగులతో అదరగొట్టినా, మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. తొలుత కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. టిమ్ సీఫెర్ట్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 62 పరుగులు చేయగా, కాన్వే (44), డారెల్ మిచెల్ (39 నాటౌట్) రాణించారు. అర్ష్ దీప్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
165 పరుగులకే టీమిండియా ఆలౌట్
అనంతరం ఛేదనలో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు కుప్పకూలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్ కాగా.. రెండో ఓవర్లో సూర్యకుమార్ (8)ను డఫీ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు.. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో శాంసన్, రింకూ మూడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. దీంతో భారత్ ఆరు ఓవర్లకు 53/2తో నిలిచింది. అయితే, శాంసన్, హార్దిక్ పాండ్యా (2)ను శాంట్నర్, తర్వాత రింకూను ఫోక్స్ ఎల్బీ చేశారు.
1-3 ఆధిక్యంలో కివీస్
అయితే ఈ దశలో ఒక్కసారిగా విజృంభించిన దూబే.. విజయంపై ఆశలు రేపాడు. సోధీ వేసిన 12వ ఓవర్‌లో దూబే రెండు ఫోర్లు, మూడు సిక్స్‌ల తో కలిపి 29 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఊపందుకొంది. ఈ క్రమంలో రాణా (9)తో కలసి దూబే ఆరో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ, దూబే రనౌట్ కావడంతో టీమిండియా పరాజయం లాంఛనమే అయింది. విజయానికి చివరి 30 బంతుల్లో 71 పరుగులు కావల్సి ఉండగా.. హర్షిత్, అర్ష్‌దీప్ (0), బుమ్రా (4), కుల్దీప్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్ డఫీ, ఇష్ సోథీ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో న్యూజిలాండ్ 1-3తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది.





