జాతీయంలైఫ్ స్టైల్

పొద్దున్నే చలిలో.. ఈ సమస్యతో ఇబ్బందా?

చలికాలం వచ్చిందంటే శ్వాసకోశ సమస్యలతో పాటు దంత సంబంధిత ఇబ్బందులు కూడా ఎక్కువగా వెంటాడుతాయి.

చలికాలం వచ్చిందంటే శ్వాసకోశ సమస్యలతో పాటు దంత సంబంధిత ఇబ్బందులు కూడా ఎక్కువగా వెంటాడుతాయి. ముఖ్యంగా పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు ఈ సీజన్‌లో చాలామందిని తీవ్రంగా బాధిస్తుంటాయి. చల్లటి వాతావరణం కారణంగా దంతాలు, చిగుళ్లు మరింత సున్నితంగా మారుతాయి. దీంతో స్వల్పమైన కారణాలకే పంటి నొప్పి మొదలవుతుంది. కొందరికి చల్లటి పదార్థాలు తిన్న వెంటనే, మరికొందరికి తీపి పదార్థాలు తీసుకున్న తరువాత పంటి నరాలు జివ్వుమని లాగినట్లు అనిపిస్తుంది. ఈ సమస్య తీవ్రత ఎంతగా ఉంటుందంటే.. చిన్న చపాతీ ముక్కను కూడా సరిగా నమలలేని పరిస్థితి ఎదురవుతుంది.

ఈ సమస్యలపై పలువురు ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. చలికాలంలో చాలా వరకు పంటి, చిగుళ్ల నొప్పులకు ఇంటి వద్ద పాటించే కొన్ని సాధారణ చిట్కాలే ఉపశమనం ఇస్తాయని ఆయన తెలిపారు. అయితే నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

సాధారణంగా పంటి నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మనం రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ అని దంత వైద్యులు చెబుతున్నారు. చాలా మంది పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని ఆశించి టూత్ పేస్ట్‌ను ఎక్కువ మొత్తంలో వేసుకుని 5 నుంచి 10 నిమిషాల వరకు బ్రష్ చేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు, ఎక్కువ పేస్ట్‌తో బ్రష్ చేయడం వల్ల పంటి పైభాగంలో ఉండే ఎనామిల్ పొర క్రమంగా తొలగిపోతుంది. ఎనామిల్ తగ్గిపోవడంతో పళ్ళు సెన్సిటివ్‌గా మారి చల్లటి, వేడి, తీపి పదార్థాలకు వెంటనే స్పందిస్తాయి.

ఈ దశలో పంటి నరాలు లాగుతున్నట్లు అనిపించడం, జివ్వుమని నొప్పి రావడం, కొన్నిసార్లు చిగుళ్లు వాపు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి భరించలేనంతగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత ఇంటి వద్ద కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

అందులో మొదటిది ఉప్పు నీటి పుక్కిలింపు. పంటి నొప్పిగా అనిపించినప్పుడు లేదా నరాలు జివ్వుమని లాగినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మేయాలి. ఇది చిగుళ్ల వాపును తగ్గించడంలో, బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. రెండో ముఖ్యమైన చిట్కా వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే ఔషధ గుణం పంటి నొప్పిని త్వరగా తగ్గించడంలో సహకరిస్తుంది. కొద్దిగా వెల్లుల్లిని మెత్తగా చేసి నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

మూడవది లవంగం. లవంగంలో ఉండే యూజెనాల్ అనే మూలకం న్యాచురల్ ఎనస్థటిక్‌లా పనిచేస్తుంది. లవంగ నూనెను లేదా లవంగాన్ని నేరుగా పంటి దగ్గర ఉంచడం వల్ల నొప్పి కొంత మేర తగ్గుతుంది. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనానికి ఉపయోగపడే చిట్కాలేనని, శాశ్వత పరిష్కారం కోసం దంత వైద్యుడి సలహా తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పంటి నొప్పి రాకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. టూత్ పేస్ట్‌ను అవసరమైనంత మాత్రమే వాడాలి. మార్కెట్‌లో లభించే సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌లను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే రోజూ సరైన విధానంలో బ్రషింగ్, మౌత్‌వాష్ వినియోగం, క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చని తెలిపారు.

ఎన్ని ఇంటి చిట్కాలు పాటించినా నొప్పి తగ్గకపోతే, చిగుళ్ల వాపు ఎక్కువైతే, లేదా తరచూ పంటి నొప్పి వస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ALSO READ: ఎఫైర్.. ప్రియుడి మోజులోపడి భర్తను లేపేసిన భార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button