
IMD Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయిన భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఆగస్ట్ 8 నుంచి 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆగస్టు 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఇప్పటికే అక్కడి చాలా నదులు, వాగులు, వంకలు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశి జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాలలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వర్షాలతో కొండలపై నుంచి కొట్టుకువచ్చిన నీరు, మట్టితో అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
తెలంగాణ, ఏపీలో కూడా భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు భారీగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏపీలోనూ పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అందుకే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Read Also: హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు, వాహనదారుల నరకయాతన!