
Heavy Rains In Andhrapradesh: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటిందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని వాతావరణ శాఖవెల్లడించింది. ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. శుక్రవారం ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది.
ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
ఉత్తర కోస్తా తీరా ప్రాంతంలోని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో పాలకొండలో అత్యధికంగా 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఇక వాయుగుండం కారణంగా కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిస్థితులలో వేట వెళ్లకూడదని సూచించారు. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప, వీలైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు.