
Heavy Rainfall In India: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈమేరకు భారత వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా పలు నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 17 వరకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తరాఖండ్ లో 5 రోజులు భారీ వర్షాలు
అటు ఉత్తరాఖండ్‌లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ సిబ్బందిని అలర్ట్ అయ్యారు. ప్రజలు నదుల దగ్గరికి వెళ్లకూడదని స్థానిక అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అటు బీహార్ భారీ వర్షాలు కురిశాయి. భగల్ పూర్ ప్రాంతంలో వరద కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. రాజధాని చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు
అటు ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. జూన్ 1 నుంచి ఆగస్టు 10 వరకు దేశం మొత్తం 539 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఇది దీర్ఘకాల సగటు కంటే 1 శాతం అధికం అని వివరించింది.
Read Also: ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్!