
Heavy Rainfall: దేశంలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే నాలుగు రోజుల పాటు వానలు పడవనున్నట్లు తెలిపింది. కేరళ, తమిళనాడులో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 6, 9 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్ లో.. అస్సాం, మేఘాలయలో ఆగస్టు 4, 7, తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాఖండ్ లో ఆగస్టు 3, 5 వానలు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఆగస్టు 4న, హిమాచల్ ప్రదేశ్లో ఆగస్టు 4, 5న వర్షాలు పడుతాయన్నారు. హర్యానా, యూపీ, బీహార్, కేరళ, కర్ణాటకలోనూ వర్షాలు పడుతాయని తెలిపింది.
తెలుగు రాష్టాల్లోనూ వర్షాలు..
అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి మూడు, నాలుగు రోజులు వానలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
గత 24 గంటల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసినట్లు ఐఎండీ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించింది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
Read Also: పావురాలకు గింజలు వేస్తే జైలుకే.. హైకోర్టు కీలక ఆదేశాలు!