
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీగా వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండిపోయి వరద ఉధృతి పెరిగే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా, ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొత్తం ముసురుపెట్టింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వెల్లడించింది.
ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలు
ఇవాళ (జూలై 25)ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read Also: అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు!