
Elction Commission On Rahul: బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేయడంపై భారత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మహారాష్ట్రలో మాదిరిగానే బిహార్‌లోనూ ఓట్ల చోరీ జరుగుతుందన్న రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, బాధ్యతా రహితమని మండిపడింది. ప్రతిరోజూ వచ్చే ఇలాంటి బెదిరింపులను తాము పట్టించుకోమని తేల్చి చెప్పింది. రాహుల్ వంటి వారు చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని తమ అధికారులకు చెప్పామని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా సవరించాలని ఆదేశించామని వెల్లడించింది.
ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ ఏమన్నారంటే?
బీహార్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని విమర్శించారు. “ఓట్ల చోరీ జరుగుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము వాటిని బయటపెడితే, ఈసీ ఏధంగా ఓట్ల చోరీ చేస్తోంది? ఎవరి కోసం చేస్తోందనేది అందరికీ తెలుస్తుంది” అని రాహుల్ చెప్పుకొచ్చారు.
ఓట్ల చోరీపై స్వతంత్ర విచారణ
బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చోరీపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందన్నారు. ఈ విచారణకు 6 నెలలు పట్టిందన్నారు. అణుబాంబు లాంటి వివరాలను బయటకు తీశామన్నారు. ఆ బాంబు పేలితే ఎన్నికల సంఘం దాక్కునే అవకాశం ఉందడని రాహుల్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది.
Read Also: నిందితులంతా నిర్దోషులే.. మాలేగావ్ కేసులో సంచలన తీర్పు!