
సాధారణంగా ఎన్నికలు సమీపిస్తే అభ్యర్థులు అభివృద్ధి హామీలు, సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు ఓటర్లకు ఖరీదైన బహుమతులు, అసాధారణ హామీలు ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నారు. విదేశీ ట్రిప్పులు, భూములు, లగ్జరీ వాహనాల వంటి ఆఫర్లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో పూణె రాజకీయ వాతావరణం వేడెక్కింది. లోహ్‌గావ్-ధనోరి వార్డులో ఓ అభ్యర్థి లక్కీ డ్రా నిర్వహించి, ఎంపికైన 11 మంది ఓటర్లకు ఒక్కొక్కరికి 1,100 చదరపు అడుగుల భూమిని ఇస్తానని హామీ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇదే తరహాలో విమన్ నగర్ ప్రాంతంలో అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి, తమకు ఓటు వేసి గెలిపిస్తే ఐదు రోజుల పాటు థాయ్‌లాండ్‌కు లగ్జరీ టూర్ అందిస్తామని ప్రకటించారు.
మరికొన్ని వార్డుల్లో లక్కీ డ్రాల ద్వారా ఖరీదైన ఎస్‌యూవీ కార్లు, ద్విచక్ర వాహనాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పైథానీ, పట్టు చీరలు, బంగారు, వెండి ఆభరణాలు వంటి కానుకలు ప్రకటించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కుట్టు మెషీన్లు, సైకిళ్లు పంపిణీ చేసినట్టు సమాచారం. క్రీడాభిమానుల కోసం క్రికెట్ లీగ్‌లు నిర్వహించి, విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించడం మరో ఆసక్తికర అంశంగా మారింది.
ఇలాంటి ఖరీదైన హామీలతో ప్రజాస్వామ్య విలువలపై చర్చ మొదలైంది. ఓటు విలువ తగ్గుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగా, ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అభివృద్ధి హామీలకు బదులుగా బహుమతుల రాజకీయమే ప్రధానంగా మారడం పూణె మున్సిపల్ ఎన్నికలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిపింది. ఎన్నికల ఫలితాలపై ఈ ఆఫర్లు ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
ALSO READ: పొద్దున్నే చలిలో.. ఈ సమస్యతో ఇబ్బందా?





