తెలంగాణ

ఇళ్లు ఇవ్వకపోతే పనులు జరగనివ్వం !

  • శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామస్థుల ఆందోళన

  • ప్రాజెక్టు పనులను అడ్డుకున్న చర్లగూడెం వాసులు

  • ప్రాజెక్టు పూర్తికావొస్తున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని ఆగ్రహం

క్రైమ్‌ మిర్రర్‌, నల్గొండ: మర్రిగూడెం మండలం శివన్నగూడెం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులను చర్లగూడెం గ్రామస్థులు అడ్డుకున్నారు. రిజర్వాయర్‌ వల్ల చర్లగూడెం గ్రామం మొత్తం ముంపునకు గురవుతుందన్నారు. ప్రాజెక్టు కారణంగా తమ గ్రామం పూర్తిగా మునిగిపోతోందని, పరిహారంగా ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు ఇవ్వలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకు స్థలాలు చూపకపోవడం శోచనీయమని మండిపడ్డారు.

ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు చూపకపోతే పనులు జరగనివ్వబోమని, గడ్డిపోచకూడా తీయనీయబోమని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న చండూరు ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్‌ ఘటనాస్థలికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిర్వాసితులు ససేమిరా అన్నారు. ఇళ్ల స్థలాలు చూపించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.

Back to top button