-
ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న బడా నాయకులెవరు….?
-
అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాటం ఆగదు
-
రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి
మహేశ్వరం ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: బడంగ్పేట్ సర్కిల్-16లో బయటపడిన భారీ అవినీతి కుంభకోణంలో భాగంగా పదిమంది అధికారుల సస్పెన్షన్ జరగడం ఈ వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. అయితే ఈ అవినీతి వెనుక ఒక ప్రభావశీల రాజకీయ నాయకుడు ఉండి, అధికారులను బెదిరిస్తూ, తప్పుదోవ పట్టిస్తూ బడంగ్పేట్ ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకున్నాడనే ఆరోపణలు మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ 61వ డివిజన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం ఘాటుగా నిర్వహించబడింది.
ప్లకార్డులు పట్టుకుని “సరస్వతి గారు వెంటనే నోరు విప్పాలి”, “సస్పెండ్ అయిన అధికారులు నిజాలు బయటపెట్టాలి”,అసలు సూత్రధారుల పేర్లు వెల్లడించాలి” అంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడంగ్పేట్ కార్పొరేషన్లో ఒక అవినీతి రాజకీయ నాయకుడు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ, వారిని అడ్డంగా ఉపయోగించుకుని ప్రజల సొమ్మును దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ నాయకుడి పేరు వెంటనే బయట పెట్టాలని సస్పెండ్ అయిన అధికారులు మరియు డీసీ సరస్వతిని బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ అంశంపై బీజేపీ నాయకులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందిస్తూ..ఇది చిన్న విషయం కాదు – ప్రజల డబ్బును కొల్లగొట్టిన దోపిడీ. ఇందులో ఉన్న పెద్దలెవ్వరైనా బయటకు రావాల్సిందే. నిజాలు దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తే బీజేపీ మరింత పోరాడుతుంది.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు.
